ఆట వినర్ గీతిక జీవితం చూస్తే ఎవరైనా కన్నీరు పెట్టాల్సిందే..!

దాదాపు పదేళ్లక్రితం ఆట సీజన్ 5 విన్నర్‌గా నిలిచిన చిన్నారి గీతక అంటే అప్పట్లో తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. ఆ తరువాత కూడా గీతిక పేరు గట్టిగానే వినిపించింది. అయితే గత కొన్నాళ్లుగా అటు టీవీలో కానీ.. ఇటు సినిమాల్లో కానీ కనిపించడం మానేసిన గీతిక ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అయ్యింది. అసలు గీతిక ఏమైంది? ఏం చదువుతోంది? తదితర విషయాలు తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పరిస్థితులపై గీతిక స్పందించింది.

2012లో ఓ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా తనకు పెద్ద ప్రమాదం జరిగిందని, దాంతో తన ఎడమకాలు, చేయి విరిగిపోయాయని తెలిపింది. తన తండ్రికి కూడా పెద్ద గాయాలు అయ్యాయని, కోలుకోవడానికి కొంత సమయం పట్టిందని పేర్కొంది. ఆ తర్వాత ఓ సినిమాతో పాటు పలు సీరియల్స్‌లో నటించానని, అయితే అనుకున్నంత గుర్తింపు రాలేదని పేర్కొంది. మరోవైపు ఉద్యోగ రీత్యా తన తల్లిదండ్రులు దుబాయ్‌కి వెళ్లాల్సి రావడంతో తాను అమ్మమ్మ-తాతయ్యల దగ్గర పెరిగానని, ఆ టైంలో తనతో పాటు షూటింగ్‌లకు రావడం వాళ్లకు కష్టం అయ్యేదని, అందుకే బ్రేక్‌ ఇ‍వ్వాల్సి వచ్చిందని తెలిపింది.

‘ఆ సమయంలో నాపై రకరకాలుగా వీడియోలు పుట్టకొచ్చాయి. ‘గీతిక అవకాశాలన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. ఓ షోకి వెళ్తే అడుగు కూడా పెట్టనివ్వలేదు‘, ‘గీతిక గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు’ లాంటి వీడియోలు చాలానే వచ్చాయి. అయితే అవన్ని అసత్య ప్రచారాలే. నాకు కూడా తెలియకుండా ఇలా ఎప్పుడు జరిగిందా అని ఆ వీడియోలు చూసి అనుకునేదాన్ని’ అని గీతిక వివరించింది. ప్రస్తుతం తాను ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదవుతున్నానని, ఇప్పటికీ డ్యాన్స్‌ని మర్చిపోలేదని చెప్పింది. డ్యాన్స్‌ తన డీఎన్‌ఏలోనే ఉందని, నెక్స్ట్‌ ఇయర్‌ కెరీర్‌ పరంగానూ ఆలోచిస్తానని పేర్కొంది. మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని తెలిపింది.