భూమా మౌనిక పొలిటిక‌ల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన మనోజ్,

మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఇటీవల పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం జరిగినప్పటి నుంచి భూమా మౌనిక రాజకీయాల్లోకి వస్తుందనే ప్రచారం నడుస్తోంది. తన సోదరి భూమా అఖిలప్రియతో ఆర్థిక వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మనోజ్ అండతో మౌనిక రాజకీయాల్లోకి వస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా మౌనిక రాజకీయ ఎంట్రీపై మనోజ్ క్లారిటీ ఇచ్చారు.

ఇవాళ తిరుమల శ్రీవారిని మనోజ్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రవేశం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు మనోజ్ స్పందించారు.రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన తనకు లేదని మనోజ్ తేల్చేశారు. ప్రజాసేవపై మాత్రం ఆసక్తి ఉందని చెప్పారు. మౌనిక రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే మాత్రం తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రజాసేవ చేయాలనే ఆలోచనే తమ ఇద్దరినీ కలిపిందని మనోజ్ వెల్లడించారు. మనోజ్ మాటలను బట్టి చూస్తే మౌనిక రాజకీయాల్లోకి రావడం పక్కా అని తెలుస్తోంది. మనోజ్ దంపతులు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కాన్వాయ్ లో బయలుదేరడం, దారి మధ్యలో పలువురు రాజకీయ నాయకులను కలసిన నేపథ్యంలో మౌనిక కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply