ఆగిన మరో పసి గుండె.. అమెరికాలో ఖమ్మం వైద్య విద్యార్థి మృతి..!

ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు తీరని విషాదాలను మిగుల్చుతున్నాయి. చిన్నా-పెద్దా, ముసలి – ముతక తేడా లేకుండా సంభవిస్తోన్న గుండెపోటు మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అప్పటివరకూ ఎంతో సరదాగా, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై కన్నుమూస్తున్నారు. తాజాగా.. కరేబియన్ దీవుల్లో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి మంగళవారం (ఏప్రిల్ 18) గుండెపోటుతో హఠాన్మరణం పొందాడు.

వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లాలోని గ్రామీణ మండలం సాయిప్రభాత్‌నగర్‌లో నివాసముంటున్న టి రవికుమార్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హేమంత్‌ శివరామకృష్ణ (20) అమెరికాలోని బార్బడోస్‌లో ఎంబీబీఎస్‌ చదివేందుకు 2021లో వెళ్లారు. ప్రస్తుతం హేమంత్‌ అక్కడ ఎంబీబీయస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలసి మంగళవారం బీచ్‌కు వెళ్లిన హేమంత్‌ .. ఈతకు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికి గుండెపోటుతో కుప్పకూలాడు.

స్నేహితులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.హేమంత్‌ శివరామకృష్ణ మృతితో రవికుమార్‌ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అమెరికాలో చదువుకుని డాక్టరై వస్తానని వెళ్లిన తమ కుమారుడు విగత జీవిగా మారాడని కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

Leave a Reply