నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కొడుకు హీరో ఎందుకు కాలేకపోయాడు..?

ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వారసులు లేక బాధ పడుతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్లకు అబ్బాయిలు లేరు. వాళ్ల అమ్మాయిలే వారసత్వం నిలబెడుతున్నారు. అలాంటిది వారసుడు ఉండి కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయాడు నటకిరీటి రాజేంద్రప్రసాద్. ఇండస్ట్రీలో 40 ఏళ్ల ప్రస్థానం ఉండి.. స్టార్ హీరోగా చక్రం తిప్పిన రాజేంద్ర ప్రసాద్ తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను మాత్రం ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయాడు. కొండంత బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా కూడా ఎందుకు తన వారసుడిని హీరో చేయలేకపోయాడు అని ఆయన అభిమానుల్లో ఎప్పటి నుంచో ఒక అనుమానం ఉంది.

దాని వెనుక ఒక పెద్ద కథ కూడా ఉంది. అందరి హీరోల మాదిరే తన వారసుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని రాజేంద్రప్రసాద్ చాలా ఆశ పడ్డాడు. దాని కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు.అంతేకాదు బాలాజీ ప్రసాద్ చూడటానికి ఆయన తండ్రి రాజేంద్రప్రసాద్ లాగే ఉంటాడు. దాంతో కొడుకును హీరోగా పరిచయం చేయాలంటూ రాజేంద్రుడిని చాలామంది అడిగారు కూడా. ఈ క్రమంలోనే తన కొడుకు బాలాజీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత రాఘవేంద్రరావు చేతిలో పెట్టాడు రాజేంద్ర ప్రసాద్.

భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, అందరూ దొంగలే ఇలాంటి కామెడీ సినిమాలు తీసిన నిధి ప్రసాద్ దర్శకత్వంలో తన కొడుకును పరిచయం చేయాలనుకున్నాడు. సినిమాకి ముహూర్తం కూడా పెట్టారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేకపోయింది. చాలా రోజుల పాటు ఆగిపోవడంతో బాలాజీ ప్రసాద్ కు సినిమాలపై విరక్తి వచ్చిందని ఇండస్ట్రీలో వార్తలున్నాయి.

తొలి సినిమా విషయంలోనే ఇన్ని కష్టాలు ఎదురుకావడంతో ఆయన తట్టుకోలేకపోయాడని.. నటన అంటేనే విసుగు తెచ్చుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈ విషయంలో రాజేంద్రప్రసాద్ ఎంత ఒప్పించాలని చూసినా కూడా తండ్రి మాటను బాలాజీ ప్రసాద్ వినలేదు. ఆ తర్వాత అసలు సినిమాల వైపు చూడలేదు. కావాలంటే నిర్మాతలను తాను తీసుకొస్తాన‌ని చెప్పినా కూడా విన‌లేదంట‌.

అయినా మాట విన‌క‌పోవ‌డంతో తానే నిర్మాతగా మారి సినిమా చేస్తానని చెప్పినా కూడా బాలాజీ ప్రసాద్ వినలేదని తెలుస్తోంది. ఎంత చెప్పినా కూడా వినకపోవడంతో కొడుకును తన ఇష్టానికి వదిలేశాడు రాజేంద్రుడు. ప్రస్తుతం ఈయన తనకు ఇష్టమైన విదేశాలకి ఎక్స్‌పోర్ట్‌ బిజినెస్ చేస్తున్నాడు. అయితే జీవితంలో ఎంత సాధించినా కూడా కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయలేకపోయాననే బాధ‌ మాత్రం నటకిరీటి మనసులో అలాగే ఉండిపోయింది.

Leave a Reply