కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ కన్నుమూత కారణం ఇదే..!

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ (53) ఆదివారం కన్నుమూశారు. వారం క్రితం వైజాగ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో వడదెబ్బతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. సివియర్‌ మెటబాలిక్‌ ఎసిడోసిస్‌ కారణంగా అవయవాలు పనిచేయడం మానేశాయి.

దీంతో షుగర్‌ లెవల్స్‌ పూర్తిగా పడిపోయాయి. గాంధీ ఆస్పత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మరణించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. రాకేశ్‌ మాస్టర్‌ అసలు పేరు ఎస్‌. రామారావు. తిరుపతి ఆయన సొంతూరు. బుల్లితెరపై ‘ఆట’ షోతో రాకేశ్‌ మాస్టర్‌ డ్యాన్సర్‌గా తన కెరీర్‌ ప్రారంభించారు.

తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు 1500 సినిమాలకు ఆయన డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేశారు. అయితే, తాను చనిపోయాక ఎక్కడ ఖననం చేయాలో రాకేశ్ మాస్టర్ గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.తన మామగారి (భార్య తండ్రి) సమాధి పక్కనే ఓ వేప మొక్క నాటానని, తాను మరణించాక ఆ చెట్టు వద్దే సమాధి చేయాలని రాకేశ్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

తనకు తమ్ముడంటే చాలా ఇష్టమని చెప్పిన రాకేశ్ మాస్టర్, తనకు తల్లి మరణించాక జీవితం మీద విరక్తి పుట్టిందని కూడా చెప్పుకున్నారు. తన తల్లి తరువాత అక్క కుమారుడు, తండ్రి కూడా మరణించడంతో చావు అంటే భయం లేకుండా పోయిందని కూడా ఓ సందర్భంలో రాకేశ్ మాస్టర్ కన్నీటిపర్యంతమయ్యారు.

Leave a Reply