ఆర్‌ఆర్‌ఆర్ స్టార్ నటుడు మృతి.. జక్కన్న ఎమోషనల్ ట్వీట్,

RRR: ప్రముఖ ఐరిష్‌ నటుడు, ఆస్కార్‌ అవార్డు అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో బ్రిటిష్‌ గవర్నర్‌గా నటించిన రే స్టీవెన్సన్ హఠాన్మరణం చెందారు. 58 ఏండ్ల స్టీవెన్‌సన్‌ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 1964లో నార్త్‌ ఐర్లాండ్‌లోని లిస్‌బర్న్‌లో స్టీవెన్సన్ జన్మించారు. ఎనిమిదేండ్ల వయస్సులో ఇంగ్లండ్‌ చేరుకున్న ఆయన బ్రిస్టల్ ఓల్డ్‌ విక్‌ థియేటర్‌ స్కూల్‌లో ప్రవేశం పొందాడు.

29 ఏండ్లకు గ్రాడ్యుయేట్‌ అయిన ఆయన 1990ల్లో టీవీ షోల్లో నటించడం మొదలు పెట్టారు. కొన్నేండ్లపాటు బ్రిటిష్ టెలివిజన్‌లో పనిచేసిన స్టీవెన్సన్‌.. 1998లో పాల్‌ గ్రీన్‌గ్రాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ద థియరీ ఆఫ్‌ ఫ్లైట్‌’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.తర్వాత గ్రీన్‌విచ్‌ మీన్‌ టైమ్‌ ఇన్‌ 1999, కింగ్‌ ఆర్థర్‌, పనిషర్‌ వార్‌ జోన్‌, బుక్‌ ఆఫ్‌ ఎలీ, ది అదర్‌ గాయ్స్‌, జో రిటాలియేషన్‌, డివర్జెంట్‌, ది ట్రాన్స్‌పోర్టర్‌: రిప్యూల్డ్‌, య్యాక్సిడెంట్‌ మ్యాన్‌, మెమొరీ సినిమాల్లో నటించారు.

థోర్‌ సిరీస్‌లతో హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరగా నటించిన ‘అశోకా’ సిరీస్‌ను డిస్నీ+ త్వరలో విడుదల చేయనుంది.ఆయన మృతిపట్ల ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేసింది. ‘ఈ వార్త తమను ఎంతో షాక్‌కు గురిచేసింది. మీ ఆత్మకు శాంతి కలగాలి. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు’ అని ట్విట్టర్‌ వేదికగా తెలిపింది.

Leave a Reply