Samantha: ఆక్సిజన్‌ మాస్క్‌తో సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్..!

సమంత పోస్ట్‌తో మయోసైటిస్‌ అంటే ఏంటనే ప్రశ్న ప్రతీ ఒక్కరిని వేధిస్తుంది.ఆటో ఇమ్యూన్‌ సమస్య కారణంగా వచ్చే వ్యాధి మయోసైటిస్. దీని వల్ల భుజాలు, తుంటి వద్ద కండరాల క్షీణత ఉంటుంది. దీన్నే పాలి మయోసైటిస్‌ అంటారు. కూర్చుంటే పైకి లేవలేరు. ఇది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లల్లో 5 నుంచి 15 ఏళ్ల వారికి, పెద్దవాళ్లలో 45 నుంచి 65 ఏళ్ల వారికి ఎక్కువ కన్పిస్తుంది. మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడటం గమనార్హం.

ఇదే సమస్య చర్మానికి కూడా వస్తుంటుంది.సమంత కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే!ఓవైపు చికిత్స తీసుకుంటూనే సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ హుషారుగా కనిపిస్తుండటంతో వ్యాధి నెమ్మదిగా నయమవుతూ వస్తోందనుకున్నారంతా! కానీ ఇప్పటికీ అదే వ్యాధితో సతమతమవుతోంది సామ్‌. తాజాగా సమంత హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఇందులో సామ్‌ ముఖానికి ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని ఉంది. తాను హైపర్‌ బారిక్‌ థెరపీ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ హైపర్‌ బారిక్‌ చికిత్స ద్వారా నిర్ణీత ప్రెజర్‌తో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందిస్తారు. దీని ద్వారా ఎక్కువ ఆక్సిజన్‌ ఊపిరితిత్తుల్లో చేరి ఇన్‌ఫెక్షన్లను తగ్గించడమే కాకుండా దెబ్బతిన్న కణజాలం తిరిగి కోలుకునేందుకు ప్రేరేపిస్తుంది.

అదనపు ఆక్సిజన్‌ బ్యాక్టీరియాపై పోరాటంలో సాయపడుతుంది. వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుంది. ఇక ఆక్సిజన్‌ మాస్క్‌తో సామ్‌ను చూసిన అభిమానులు నువ్వు చాలా స్ట్రాంగ్‌, త్వరలోనే ఈ వ్యాధిని జయిస్తావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply