విరూపాక్ష మూవీ రివ్యూ మరియు రేటింగ్..!

సాయిధరమ్ తేజ్ టైటిల్ పాత్రలో నటించగా విడుదలైన చిత్రం “విరూపాక్ష”. 2015లో విడుదలైన “భమ్ బోలేనాధ్”తో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ దాదాపు ఏడేళ్ళ అనంతరం మళ్ళీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. సోనియా సింగ్‌, అజయ్‌, బ్రహ్మాజీ, సాయిచంద్‌, సునీల్‌, రాజీవ్ కనకాల, శ్యామల తదితరులు;

స్క్రీన్ ప్లే: సుకుమార్‌, ఛాయాగ్రహణం: శ్యామ్ దత్ సైనుద్దీన్‌, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్‌; ఎడిటర్‌: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌: శ్రీనాగేంద్ర తంగల, సమర్పణ: బాపినీడు; నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌; సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్; దర్శకత్వం: కార్తీక్ వర్మ దండు.

కథ:
1979 కాలంలో రుద్రవనంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు.. ఆ ఊరి విధివిధానాలను మార్చేస్తాయి. అలా జరిగిన కొన్నేళ్లకు సూర్య (సాయిధరమ్ తేజ్) తల్లితో కలిసి రుద్రవనానికి వస్తాడు. అక్కడ తొలి చూపులోనే నందిని (సంయుక్త మీనన్)తో ప్రేమలో పడతాడు. ఊరు మొత్తం పీడశక్తి కారణంగా అల్లకల్లోలమవుతున్న సందర్భంలో.. సూర్య ధైర్యంగా నిలబడి, రుద్రవనానికి పట్టిన పీడను తొలగించడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. అసలు రుద్రవనంలో ఏం జరిగింది? ఆ ఊరి ప్రజలను కాపాడడానికి సూర్య చేసిన సాహసం ఏమిటి? అనేది వెండితెరపై చూడాలి.

నటీనటుల పనితీరు:
నటుడిగా సాయిధరమ్ తేజ్ లో ఎనర్జీ లోపించింది. అతడి పాత్రలోని కచ్చితత్వం, నిజాయితీ కనిపించినప్పటికీ.. ఇంకాస్త హుషారు ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సాయితేజ్ నటన విషయంలో బాగా తేలిపోయాడు. మరి యాక్సిడెంట్ ఎఫెక్టో లేక.. సెటిల్డ్ గా చేయాలనే తపనతో తన మార్క్ ఇంటెన్సిటీని పక్కన పెట్టాడో తెలియదు కానీ.. సాయితేజ్ వీక్ పెర్ఫార్మెన్స్ తేటతెల్లమవుతుంది.

సంయుక్త మీనన్ ఈ చిత్రంలోని నందిని పాత్రలో ఆశ్చర్యపరిచింది. ఆమెకు నటన రాదంటూ కామెంట్ చేసినవాళ్లందరి నోర్లు మూయించింది. ఆమె పాత్ర సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. అలాగే.. తెలుగు చిత్రసీమలో ఆమె స్థానాన్ని ఇంకాస్త బలపరిచింది.అజయ్, రవికృష్ణలు ఈ చిత్రంతో తమలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వారి క్యారెక్టరైజేషన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సాయిచంద్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

చివరిగా.. 2.75/5

Leave a Reply