Nara Chandrababu Naidu| ఎన్టీఆర్‌ యుగ పురుషుడైతే.. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్..!

అలనాటి తెలుగు అగ్రనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) యుగ పురుషుడైతే.. నేటి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మంచి విజనరీ అని పేర్కొన్నారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఈ మేరకు ఆయన శుక్రవారం విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన క్రమంలో వారితో తనకున్న అనుబంధం, అనుభవాల గురించి వివరించారు.

కాగా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ కుమారుడు, ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల నుంచి తనకు మంచి మిత్రుడని, నటుడు మోహన్‌బాబు ఆయనను తొలిసారి తనకు పరిచయం చేశారని తెలిపారు.1996లోనే చంద్రబాబు తన విజన్‌-2020 ప్రణాళిక ద్వారా డిజిటల్‌ వరల్డ్‌ గురించి,

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగానికి ఉన్న భవిష్యత్‌ గురించి ఊహించి చెప్పారని, దీనిని అమలుచేసి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ను హైటెక్‌ సిటీగా మార్చారని గుర్తుచేశారు.ఇక మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ లాంటి బిజినెస్‌ టైకూన్స్‌ చంద్రబాబును అభినందించారని, వారి కంపెనీలను హైదరాబాద్‌లో ప్రారంభించారని తెలిపారు. ఇప్పుడు లక్షలాదిమంది తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా, లగ్జరీగా బతుకుతున్నారంటే దానికి కారణం చంద్రబాబేనని స్పష్టం చేశారు.

ఇక ఇటీవల రాష్ట్రాభివృద్ధికి సంబంధించి రూపొందించిన విజన్‌-2047 ప్రణాళిక గురించి చంద్రబాబు తనకు వివరించారని, అది కనుక సమర్ధవంతంగా అమలైతే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో ఎక్కడికో వెళ్లిపోతుందని అన్నారు. అయితే ఇది కార్యరూపం దాల్చాలంటే చంద్రబాబుకు దేవుడి ఆశీస్సులు ఉండాలని, అలాగే దివంగత ఎన్టీఆర్‌ ఆత్మ ఆయనతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.

Leave a Reply