చెప్పులు కొనే డబ్బు లేక మండే ఎండ‌ల్లో పిల్లలకోసం ఆ మ‌హిళ ఏం చేసిందంటే..!

మండు వేస‌విలో రోడ్డుపైకి రావాలంటేనే జ‌నం వ‌ణికిపోతుంటే ఓ త‌ల్లి త‌న పిల్ల‌ల‌కు చెప్పులు కొనే స్ధోమ‌త లేక‌పోవ‌డంతో కాళ్ల‌కు ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను చుట్టి న‌డిపిస్తున్న ఘ‌ట‌న వెలుగుచూసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షోపుర్‌లో ఈనెల 21న నిరుపేద మ‌హిళ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి రోడ్డుపై వెళుతూ రిపోర్ట‌ర్ కంటప‌డింది. గిరిజ‌న మ‌హిళ‌, త‌న పిల్ల‌ల కాళ్ల‌కు పాలిథిన్ బ్యాగ్స్ చుట్టి న‌డిచివెళుతుండ‌టం చూసిన స్ధానిక‌ రిపోర్ట‌ర్ ఇన్సాఫ్ ఖురేషి వారిని ప‌ల‌క‌రించాడు.

రుక్మిణి ద‌య‌నీయ ప‌రిస్ధితుల‌ను తెలుసుకున్న ఖురేషి వారి ఫొటోను క్లిక్‌మ‌నిపించ‌డంతో పాటు వారికి చెప్పులు కొనుగోలు చేసేందుకు సాయం చేశాడు. స‌హ‌రియ గిరిజ‌న తెగ‌కు చెందిన రుక్మిణి భ‌ర్తకు టీబీ సోక‌డంతో వారి కుటుంబ క‌ష్టాలు మ‌రింత తీవ్ర‌మ‌య్యాయి.

భ‌ర్త ప‌నిచేయ‌లేక‌పోవ‌డంతో పొట్ట‌పోసుకునేందుకు ప‌నుల‌ కోసం రుక్మిణి న‌గ‌ర వీధుల్లో తిరుగుతోంది. పిల్ల‌ల‌ను చూసేవారు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో మండుటెండ‌లో పిల్ల‌ల‌తో క‌లిసి రుక్మిణి ప‌నుల కోసం వెతుకులాట‌లో ప‌డింది.

మ‌హిళ కుటుంబ దుస్ధితిని తెలుసుకున్న స్ధానిక అధికారులు స్పందించి వారికి వీలైనంత సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మ‌హిళ కుటుంబానికి ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌ని షోపూర్ క‌లెక్ట‌ర్ శివం వ‌ర్మ పేర్కొన్నారు. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌లు చోట్ల ఉష్ణోగ్ర‌త‌లు 44 డిగ్రీల సెల్సియ‌స్ దాట‌డంతో ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

Leave a Reply