మరో విషాదం.. సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత..!

టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. తెలుగు చిత్రసీమలో తమదైన ముద్ర వేసిన సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిలో ఒకరైన రాజ్ ఇవాళ హైదరాబాదులో మృతి చెందారు. కూకట్ పల్లిలోని తన నివాసంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

రాజ్ కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.ఆయన అంత్యక్రియలు రేపు హైదరాబాద్ మహాప్రస్థానం శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.
రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు కుమారుడే రాజ్. కోటితో జతకట్టి రాజ్-కోటి పేరుతో ఈ జంట సుదీర్ఘకాలం పాటు శ్రోతలను తమ సంగీతంతో ఉర్రూతలూగించారు.

బీట్ ఓరియెంటెడ్ పాటలకు ఈ జోడీ పెట్టింది పేరు. వీరిద్దరూ 180 చిత్రాలకు పైగా సంగీతం అందించారు. ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్ కూడా చేశారు.
నాగార్జున కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రం హలో బ్రదర్ కు ఈ జోడీ బంగారు నంది అందుకుంది. కోటి నుంచి విడిపోయాక రాజ్ 10 సినిమాలకు పైగా సొంతంగా సంగీతం అందించారు. కొన్ని సినిమాల్లో రాజ్ నటుడిగానూ కనిపించారు.

Leave a Reply