Simhadri Appanna | సింహాద్రి అప్పన్న హుండీలో 100 కోట్ల రూపాయల చెక్..కానీ ఖాతాలో ఉంది ఎంతో తెలుసా..

Simhachalam | ఆలయం అన్నాక హుండీలో భక్తులు కానుకలు సమర్పించుకోవడం పరిపాటే. కోరికలు తీరిన భక్తులు స్వామి వారికి కానుకలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, ఎవరి తాహతుకు తగ్గట్లుగా వారు కానుకలు సమర్పిస్తారు. కొందరు ఖరీదైన కానుకలు ఇస్తారు. బంగారం, వజ్ర వైడూర్యాలు సమర్పిస్తారు. మరికొందరు కోట్ల రూపాయల డబ్బు కానుకగా ఇస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల శ్రీవారి ఆలయంలో ఇలాంటివి సర్వసాధారణం.

కానీ సింహాచలం వరాహలక్ష్మీ నరసింహా స్వామి హుండీని సిబ్బంది పక్షం రోజులకు ఒకసారి లెక్కిస్తారు. తాజాగా ఈ హుండీని ఓపెన్ చేయగా.. అందులో రూ.100 కోట్ల విరాళం కనిపించింది. సింహాద్రి అప్పన్న ఆలయంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఆలయ చరిత్రలోనే రూ.100 కోట్ల కానుక హుండీలో పడటం ఇదే ప్రథమం. దీంతో ఆలయ సిబ్బంది కూడా ఎన్నో ఆశలు పెంచుకున్నారు. ఆలయాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలా ? అని ఆలోచనలు చేశారు.

ఈ విషయం ఆ నోట ఈ నోట మీడియాకు చేరింది. మీడియా సిబ్బంది కొరకు ఈ విషయాన్ని ఆలయ సిబ్బందితో ప్రస్తావించారు. ఆలయ సిబ్బంది ఆ చెక్ వివరాల కోసం బ్యాంకును సంప్రదించారు. బ్యాంకు నుంచి వారు దిమ్మదిరిగే జవాబు విన్నారు. సదరు ఖాతాదారు పేరు బొడ్డెపల్లి రాధాకృష్ణకి చెందినదని బ్యాంకు అధికారులు చెప్పారు. ఆయన ఖాతాలో రూ.100 కోట్లు కాదు కదా.. 100 రూపాయలు కూడా లేవని చెప్పారు. ఆ ఖాతాలో రూ.17 మాత్రమే ఉన్నాయని వివరించారు. దీంతో ఆలయ సిబ్బంది ఖంగుతిన్నారు.

Leave a Reply